ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. పుట్టాలంటే ఆయనే పుట్టాలి: సీఎం చంద్రబాబు
రాజకీయాల్లో టీడీపీ ఓ సంచలనమమని, ఓ అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ 43వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
By అంజి
ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. పుట్టాలంటే ఆయనే పుట్టాలి: సీఎం చంద్రబాబు
అమరావతి: రాజకీయాల్లో టీడీపీ ఓ సంచలనమమని, ఓ అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ 43వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఒక మహానీయుడి విజన్ నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని సీఎం చంద్రబాబు తెలిపారు. 'పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు. పుట్టాలంటే మళ్లీ ఎన్టీఆరే పుట్టాలి. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది. మనమంతా వారసులం మాత్రమే, పెత్తందారులం కాదు. టీడీపీని లేకుండా చేయాలని చూసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీని ఏమీ చేయలేకపోయారని, ముహూర్త బలం గొప్పదని అన్నారు.
టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అనేలా ప్రజల కోసం పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణయుగం అనే రోజులు శాశ్వతంగా వస్తాయన్నారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికలు చరిత్ర సృష్టించాయని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అఖండ విజయాన్ని సాధించాయని అన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో అద్భుత విజయం సాధించామన్నారు. ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు వచ్చినా కార్యకర్తలు ధైర్యం వదల్లేదన్నారు. ఆర్థికంగా దెబ్బతీసి కుంగదీయాలని ఎన్నో కుట్రలు పన్నారని, ఆస్తులు విధ్వంసం చేసినా ఎవరికీ భయపడలేదని చంద్రబాబు అన్నారు. ప్రతి కార్యకర్త త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటామన్నారు. మంచి చేస్తే మంచిగా ఉంటానని, తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టనని అన్నారు. కార్యకర్తలు హుషారుగా ఉంటే.. టీడీపీకి ఓటమి అనేదే ఉండదన్నారు.
అటు రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా టీడీపీకే సాధ్యమని మంత్రి లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం అని పేర్కొన్నారు. 43 ఏళ్ల క్రితమే ఆయన పార్టీ స్థాపించారని, 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఢిల్లీకి తెలుగువారి సత్తా చూపించారని పేర్కొన్నారు. తమ పార్టీకి గల్లీ, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసునని అన్నారు. టీడీపీ జెండా పీకేస్తారని ప్రగల్భాలు పలికిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారని పార్టీ ఆవిర్భావ సభలో నారా లోకేష్ అన్నారు.