అమరావతి: సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందడం తనను కలచి వేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్టు చెప్పారు. గాయపడన వారికి చికిత్స అందించాలని ఆదేశించానని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు. రూ.300 దర్శన టికెట్ల మార్గంలో నిర్మించిన గోడ వద్ద ఓ భారీ టెంట్ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున వచ్చిన భారీ ఈదురుగాలులకు ఆ టెంట్ గోడపై పడటంతో అద కూలి విషాదం నెలకొన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అప్పన్న చందనోత్సవాల్లో భాగంగా 20 రోజుల కిందటే ఈ గోడ నిర్మించినట్టు తెలుస్తోంది.
ప్రమాదానికి కారణమైన గోడకు ఇరువైపులా అధికారులు ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన సమయంలో గోడ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు నేరుగా భక్తులపై పడకుండా ఆ ఫెన్సింగ్ అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అది లేకపోయినట్లయితే పెను ప్రమాదం జరిగి మృతుల సంఖ్య భారీగా పెరిగేదని సమాచారం. అటు సింహాచలం ఘటనపై విచారణకు ఆదేశించినట్టు మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయం వద్ద గోడ కట్టిన కాంట్రాక్టర్, అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కాంక్రీట్ బీమ్ కానీ, దిమ్మె కానీ నిర్మించకుండా 20 అడుగుల గోడ కట్టడమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.