3వ రోజు యూఏఈ పర్యటనలో సీఎం చంద్రబాబు

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఉద్దేశించిన యూఏఈలో..

By -  అంజి
Published on : 24 Oct 2025 7:31 AM IST

CM Chandrababu Naidu, UAE visit, APnews

3వ రోజు యూఏఈ పర్యటనలో సీఎం చంద్రబాబు

అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఉద్దేశించిన యూఏఈలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన ఈ రోజుతో ముగియనుంది. పర్యటన చివరి రోజూ యూఏఈ లోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సీఎం వరుసగా భేటీ కానున్నారు.

ఈ ఉదయం యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జయూదీ తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అనంతరం యుఏఈ ఆర్థిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీతో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. అలాగే, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ చైర్మన్, సీఈఓ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ తో సమావేశం అవుతారు. మధ్యాహ్నం దుబాయ్‌లోని గ్రాండ్ హయత్ హోటల్‌లో పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. దుబాయ్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ వైస్ చైర్‌పర్సన్ దీప రాజా కార్బన్, క్రౌన్ ఎల్‌ఎన్‌జీ సీఈవో స్వపన్ కటారియా, కార్బోనాటిక్, ట్రిస్టార్ గ్రూప్, ఆస్టర్ గ్రూప్ ప్రతినిధులతోనూ చర్చలు జరుపుతారు.

ఎల్ఎన్‌జీ, లిక్విడ్ పెట్రోలియం, హెల్త్‌కేర్, వర్చువల్ అసెట్స్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలను సీఎం వివరించనున్నారు. సాయంత్రం బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. దీనికి ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్, దమాక్ ప్రాపర్టీస్, బ్రూక్‌ఫీల్డ్ ప్రైవేట్ క్యాపిటల్, డమాక్ గ్రూప్, గ్లోబల్ వెంచర్స్, బ్రిడ్జ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారు. అనంతరం దుబాయ్ లోని మెరిడియన్ హోటల్‌లో ప్రవాస తెలుగు వారితో జరిగే ఏపీ డయాస్పోరా సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. దుబాయ్, గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలి రానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రాత్రికి స్వదేశానికి తిరిగి ప్రయాణం అవుతారు.

Next Story