అమరావతి: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏటా భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారు. 1,711 జూనియన్ లైన్‌మెన్, 800 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీఎస్పీడీసీఎల్‌లో 2,850, ఏపీసీపీడీసీఎల్‌లో 1,708, ఏపీఈపీడీసీఎల్‌లో 2,584.. మొత్తంగా వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. చివరిసారి 2018లో విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీల భర్తీ జరిగింది.
అయితే ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. పోస్టులన్నింటినీ ఒకే విడతలో కాకుండా ఏడాదికోసారి భర్తీ చేయడం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం పడబోదని మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ విజయానంద్ వివరించారు. వారి అభిప్రాయంతో సీఎం చంద్రబాబు ఏకీభవించారు. ముందస్తుగా ఏఈఈ, జేఎల్‌ఎం పోస్టులను అవసరమైన మేరకు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.