అమరావతి: సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. వార్షిక క్యాలెండర్ ద్వారా ఏడాదిలో ఏ నెలలో ఈ పథకం అమలు చేస్తున్నామనే వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తల్లికి వందనం పథకం కింద పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 జమ చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఒకే విడతలోనే ఈ స్కీమ్ నిధులు జమ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
మంగళవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మద్యం కుంభకోణం, తల్లికి వందనం, ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తల్లికి వందనం కింద ఇచ్చే మొత్తాన్ని రెండు దఫాల్లో ఇస్తే బాగుంటుందని కొందరు మంత్రులు సూచించారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయంలో మరో ఆలోచనకు ఛాన్స్ లేదన్నారు. ఒకే విడతలో తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా స్కూళ్లు పునఃప్రారంభించేలోగా ఈ నిధులిచ్చి తీరాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రులు వినూత్నంగా ఆలోచించాలన్నారు.