సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోనే పొదుపు సంఘాలకు రుణాలు
పొదుపు సంఘాలు ఆన్‌లైన్‌లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని చెప్పారు.
By - అంజి |
సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోనే పొదుపు సంఘాలకు రుణాలు
అమరావతి: పొదుపు సంఘాలు ఆన్‌లైన్‌లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని చెప్పారు. ఇప్పటివరకు పొదుపు సంఘాల మహిళలు లోన్ కావాలంటే రకరకాల డాక్యుమెంట్లు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారుల సంతకాల కోసం వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు. రుణ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుంది. దీనివల్ల మహిళల సమయం ఆదా అవుతుంది మరియు పారదర్శకత పెరుగుతుంది. అర్హత ఉన్న సంఘాలకు ఆన్‌లైన్ ద్వారానే వేగంగా లోన్ మంజూరు అవుతుంది.
1.13 కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాల ద్వారా రూ.26 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారని అభినందించారు. గుంటూరులో నిర్వహించిన సరస్ మేళాలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలని, ఎంఎస్‌ఎంఈలు పెట్టుకోవాలని సూచించారు.
డ్వాక్రా, మెప్మా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల మేళా (సేల్ ఆఫ్ రూరల్ ఆర్టిసాన్స్ సొసైటీ మేళా-2026)ను గురువారం సాయంత్రం గుంటూరులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో 30 ఏళ్ల కిందట డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. డ్వాక్రా వ్యవస్థ అంచలంచెలుగా ఎదిగిందని, ఎన్నో అద్భుతాలు సృష్టించిందని అన్నారు.
పొదుపు సంఘాల మహిళలు 2025 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుండి దాదాపు రూ.47,000 కోట్లు రుణాలు తీసుకున్నారని, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 1.13 కోట్ల మంది DWCRA మహిళలు రూ.26,000 కోట్లు సమీకరించారని తెలిపారు. అలాగే రూ. 5,200 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకున్నారని కొనియాడారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో 89 లక్షల మంది, మెప్మా సంఘాల్లో 24 లక్షల మంది సభ్యులున్నారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 93 వేల మంది మైక్రో, ఎంఎస్‌ఎంఇ ద్వారా వ్యాపార రంగంలో స్థిరపడ్డారని తెలిపారు.
"2024-25లోనే డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుండి రూ. 46,590 కోట్లు రుణాలు తీసుకున్నారు" అని గుంటూరులో సరసమేళా-2026ను ప్రారంభిస్తూ చంద్రబాబు అన్నారు. సాంప్రదాయ హస్తకళలు, చేనేత వస్త్రాలు, స్థానిక ఆహార ఉత్పత్తులకు మార్కెట్ లింకేజీలను అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.