Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఆ పథకం మళ్లీ ప్రారంభం
ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 1:47 AM GMTAndhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఆ పథకం మళ్లీ ప్రారంభం
ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశాఖ మీద సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖలో 2014-19 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో ఎన్టీఆర్ బేబీ కిట్లను అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శిశువులకు అవసరమైన సామగ్రిని కిట్స్ ద్వారా పంపిణీ చేయాలన్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం బేబీ కిట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రసవం తర్వాత శిశువులకు ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో చిన్న పరుపు, చేతులు శుబ్రం చేసుకునేందుకు లిక్విడ్, బేబీ సబ్బు, పౌడర్, దోమతెర గొడుగు, న్యాప్‌కిన్లను బాలింతలకు అందజేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొన్నాళ్లు అమలు చేసినా.. ఆ తర్వాత ఆపేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు అధికారులకు ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
అలాగే ప్రజారోగ్యంపై పలు సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. సీటీ స్కాన్ సర్వీసెస్‌ను అన్ని జిల్లా ఆస్పత్రులలో ఏర్పాటు చేయాలని.. రాష్ట్రంలో టీబీ రోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధ్యయనం చేసి వారికి మందులు అందించాలని ఆదేశించారు. ఫీడర్ అంబులెన్సుకు సాధారణ అంబులెన్సుకు మధ్య అనుసంధానం పెంచాలన్న చంద్రబాబు.. డోలీ మోతలు ఇంకా కనబడుతున్నాయన్నారు. డోలీ మోతలు మళ్లీ రిపీట్ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ ఆసుపత్రుల పనితీరు బెస్ట్‌గా ఉండేలా పనిచేయాలన్నారు.