మద్యం ధరలపై సీఎం సీరియస్ ఆదేశాలు..!
మద్యం ధరల విషయంలో అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
By అంజి Published on 29 Oct 2024 7:53 AM ISTమద్యం ధరలపై సీఎం సీరియస్ ఆదేశాలు..!
మద్యం ధరల విషయంలో అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్‌పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకన్నా ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం సూచించారు. నిన్న మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కొత్త మద్యం పాలసీ అమలు విధానానని సీఎంకు అధికారులు వివరించారు.
ఎంఆర్పీకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్ వేయాలని, తరువాత కూడా తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని, లిక్కర్ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా ఉండాలన్న సీఎం.. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా చూడాలన్నారు. ప్రతి షాపులో సిసి కెమేరాలు ఉండేలా చూడాలని, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. ప్రతి షాపు వద్ద మద్యం ధరల పట్టిక తప్పకుండా ఉండేలా చూడాలని, మద్యం షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు, మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలని సూచించారు.