కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

By Srikanth Gundamalla  Published on  6 Sep 2024 3:25 AM GMT
కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లల వసూలుపై ఊరటనిచ్చే విషయం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లుల వసూలుని వాయిదా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మత్తులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని అన్నారు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు రేట్లు డిమాండ్‌ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్‌ స్టవ్‌ల రిపేర్లు.. ఇలా ఏ రిపేర్‌కు అయినా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ఇలాంటి సేవలు అందించేవారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే నీటి సరఫరాను పునరుద్ధరించామని సీఎం చంద్రబాబు చెప్పారు. పారిశుద్ధ్య పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే అగ్నిమాపక యంత్రాలను 5వేల ఇళ్లలో ఉన్న బురదను శుభ్రం చేశామన్నారు. అవసరం మేరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అగ్నిమాపక యంత్రాలను రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు నిల్వ ఉందనీ.. అవి వెళ్లిపోయిన తర్వాత అన్ని చోట్ల శుభ్రం చేస్తామన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కొన్ని చోట్ల ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రోజుకు 80,000 మందికి చొప్పున నూడుల్స్‌ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్లు, పాలు, వాటర్‌ బాటిళ్లు అందిస్తామని, అలాగే చౌకగా కూరగాయలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలను అందిస్తామని చెప్పారు.

Next Story