ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా హై కోర్టు నుండి తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే..! దీన్ని ఆయా పార్టీల అనుచరులు తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో కోర్టులు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హైకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు ప్రచారంలో ఉన్నట్లు ఏపీ సిఐడీ దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సిఐడి తెలిపింది. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేస్తూ ఉన్న వారిపై తీవ్ర చర్యలు తీసుకున్నామని.. ఇప్పుడు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని గుర్తు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై వ్యతిరేకంగా కామెంట్లు చేయడం తీవ్రమైన నేరం అని చెప్పారు. వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, లైక్లు, కామెంట్స్, ఫార్వర్డ్ చేయటం నేరమని ఏపీ సిఐడి తెలిపింది.
ఇలాంటి ఘటనలపై ఏపీ సిఐడి సోషల్ మీడియా, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎంతటి వారైనా, ఏ రాష్ట్రంలో ఉన్నా.. ఏదేశం లో ఉన్నా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని ఏపీ సిఐడి తెలిపింది. కుట్రపూరితంగా కొంతమంది ఒక పథకం ప్రకారం రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని.. వారిపై కూడా నిఘా పెట్టినట్లు ఏపీ సిఐడి తెలిపింది.