గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీఐడీ తన వాదనలు వినిపించింది. వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి గురువారం తీర్పును వెలువరించారు. వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా జడ్జి తిరస్కరించారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న వంశీని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుతో పాటు మరిన్ని కూడా ఆయనపై నమోదు అయ్యాయి. ప్రస్తుతం వంశీ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.