చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధనపల్లెలోని అమరరాజా గ్రోత్ కారిడార్‌లోని బ్యాటరీల తయారీ ప్లాంట్‌లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
175 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇన్వర్టర్ తయారీ యూనిట్‌లో మంటలు చెలరేగినప్పుడు 250 మంది కార్మికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
గతంలోనూ భారీ అగ్నిప్రమాదం.
చిత్తూరు జిల్లా పేటమిట్ట గ్రామంలోని అమరరాజా గ్రూపునకు చెందిన మంగళ్ పరిశ్రమలో 2017 జనవరిలో ఇలాంటి ఘటనే జరిగింది. అగ్ని ప్రమాదంలో రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఫ్యాక్టరీలోని జించ్ సెగ్మెంట్‌లోని కంట్రోల్ ప్యానెల్ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. ఫ్యాక్టరీలో ఉన్న 300 మందికి పైగా కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.