ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనను ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. ఈ నిషేదాన్ని సవాల్ చేస్తూ వైసీపీ పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో ప్రజా ప్రమోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న నాటకాన్ని నిషేదించడం నిబంధనలకు విరుద్దమని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించగా.. ప్రభుత్వానికి వచ్చిన రిప్రజెంటేషన్ ఆధారంగా బ్యాన్ విధించినట్లు హైకోర్టుకు ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. నాటకంలో ఒక పాత్ర బాగోలేకపోతే ఆ పాత్రను తొలగించాలి కానీ.. మొత్తం నాటకాన్ని ఎలా నిషేదిస్తారు అని ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేదించనప్పుడు నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారని అడిగింది. ఇక ప్రభుత్వం వద్దకు వచ్చిన రిప్రజెంటేషన్‌ను తమ ముందు ఉంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మంగళవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్‌పై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.