బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. ఏపీలో తొలి కేసు
పచ్చి మాంసం తిన్న రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. ఈ ఘటన కలకలం రేపుతోంది.
By అంజి
బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. ఏపీలో తొలి కేసు
అమరావతి: పచ్చి మాంసం తిన్న రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. ఈ ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఈ వైరస్‌తో మనుషులు మరణించడం ఇదే ఫస్ట్ టైమ్. అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మార్చి 16వ తేదీన మృతి చెందింది. పాప స్వాబ్ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా తేలింది. దీంతో వైద్యశాఖ అధికారులు.. చిన్నారి కుటుంబాన్ని విచారించారు.
కోడిని కోసేటప్పుడు అడగ్గా ఓ ముక్క ఇచ్చామని, అది తిన్న చిన్నారి జబ్బు పడిందని తల్లిదండ్రులు చెప్పారు. గతంలోనూ ఓ సారి ఇలాగే ఇచ్చామన్నారు. ఉడికించిన మాంసం తిన్న తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని చిన్నారి తల్లి చెప్పారు. పెంపుడు, వీధి కుక్కలతో చిన్నారి తరచూ ఆడుకునేదని వివరించారు. కాగా బాలిక నివసించే ఇంటికి కిలోమీటరు సమీపంలో ఒక మాంసం దుకాణం ఉందని అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో జ్వర సర్వే చేసిన అధికారులు.. అలాంటి లక్షణాలు ఉన్న వారేవరూ కనిపించలేదని తెలిపారు.
ఇదిలా ఉంటే.. పచ్చి మంసానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చి మాంసంలోని సాల్మొనెల్లా, కాంపిలోబ్యాక్టర్,ఇ.కోలి బ్యాక్టీరియా చాలా డేంజర్ అని చెబుతున్నారు. అందుకే చికెన్‌తో పాటు గుడ్లను 100 డిగ్రీలకుపైగా ఉడికించి తినాలి. జబ్బు పడిన జంతువులు, పక్షులకు దూరంగా ఉండాలి. జ్వరం, జలుబు, దగ్గు తీవ్ర స్థాయిలో ఉండే వెంటనే వైద్యులను సంప్రదించాలి.