వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు
Changes in YSR Bheema scheme in AP.కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా
By తోట వంశీ కుమార్
కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా 'వైఎస్ఆర్ బీమా' లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం 'వైఎస్ఆర్ బీమా' పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పారు.
కుటుంబంలో సంపాదిస్తున్న 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి సహజంగా మరణిస్తే.. రూ.లక్ష, 18-70ఏళ్లు ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణస్తే రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ బీమా పథకంలో చేసిన మార్పులు జులై1 నుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. ఈలోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతు ఆత్మహత్యలు, ప్రమాదవవాత్తు మత్య్సకారులు మరణించినా, పాడిపశువులు మృత్యువాత పడినా తదితరాలకు ఇచ్చే బీమా పరిహారాలన్నీ దరఖాస్తు అందిన నెల రోజుల్లోగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్ చెప్పారు.






