అల్లాటప్పాగా అభ్యర్థుల ఎంపిక చేయలేదు : చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 26 Feb 2024 2:15 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ తన నాటకాలతో పేదలను మోసం చేస్తున్నాడని.. ఆయన నాటకాల ముందు సురభి నాటకాలు కూడా పనిచేయవని అన్నారు. పేదల రక్తం తాగేవాడు పేదల ప్రతినిధి అవుతాడా? రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నాడు... ఊరికో ప్యాలెస్ ఉన్న వ్యక్తి తాను పేదవాడ్నని చెప్పుకుంటున్నాడని అన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలను పేదరికంలోకి నెట్టేశారని, వైసీపీ నేతలు మాత్రం ధనవంతులయ్యారని అన్నారు. ఒక చేత్తో రూ.10 ఇచ్చి, మరో చేత్తో రూ.100 దోచుకునే దోపిడీ ప్రభుత్వం అని అన్నారు.
అల్లాటప్పాగా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక చేయలేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలకు ఫోన్ కాల్స్ చేశానన్నారు. 1.30 కోట్ల మంది నుంచి నా నుంచి ఫోన్ కాల్స్ కు సమాధానం వచ్చిందని తెలిపారు. వారందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న మీదటే ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టాలన్నది నిర్ణయించామని తెలిపారు. కొత్త విధానాలు అమలు చేయడంలో నేనెప్పుడూ ముందుంటాను. అమెరికాలో ఓ విధానం ఉంది. ఎన్నికల కంటే ముందు ఆయా పార్టీల్లోనే అంతర్గత ఎన్నికలు జరుగుతాయి. అందులో గెలిచిన అభ్యర్థులే ప్రజా ఎన్నికల్లో పాల్గొంటారన్నారు. జగన్ మోహన్ రెడ్డి గ్యాంగ్ బందిపోటు దొంగలు. ఎక్కడ భూమి దొరికితే అక్కడ వాళ్లు వాలిపోతారు, ఎక్కడ గనులు ఉంటే అక్కడ వాలిపోతారన్నారు చంద్రబాబు నాయుడు.