రాష్ట్రమా? రావణ కాష్ఠమా?..వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు వీడియో ట్వీట్

చంద్రబాబు ఓ వీడియోను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. రాష్ట్రంలో జరిగిన వరుస దుర్ఘటనలు షేర్ చేస్తూ..

By Srikanth Gundamalla  Published on  26 Jun 2023 10:48 AM GMT
TDP, Chandrababu, YCP, Andhra pradesh, CM Jagan

 రాష్ట్రమా? రావణ కాష్ఠమా?..వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు వీడియో ట్వీట్

ఏపీలో రాజకీయ వేడి అప్పుడే మొదలైంది. ఓ వైపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా చంద్రబాబు ఓ వీడియోను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. రాష్ట్రంలో జరిగిన వరుస దుర్ఘటనలు చంద్రబాబు షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఇది రాష్ట్రమా..? రావణ కాష్ఠమా అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను వీడియోలో ప్రస్తావించారు. అంతేకాదు.. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు నరకం అనుభవించారని చంద్రబాబు ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు.

టెన్త్‌ విద్యార్థిని సజీవదహనం, ఏలూరు యాసిడ్‌ దాడిపై సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు చంద్రబాబు. నెల్లూరు, మచిలీపట్నం అత్యాచార ఘటనపైనా జగన్‌ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని రావణ కాష్ఠంలా మారుతోందని ఆందోళన చెందారు. ఇంతా జరుగుతున్నా సీఎం జగన్ ఒక్క సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడం ఆయన పాలనకు దారుణ ఉదాహరణ అని చెప్పారు. సీఎం జగన్ నిజంగా ప్రజల బిడ్డ అయితే.. దాడులకు పాల్పడ్డ సొంత పార్టీ నేతలను కాపాడుతారా? అని ప్రశ్నించారు చంద్రబాబు.

రానున్నరోజుల్లో గల్లీ నుంచి నగరాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నేతల అక్రమాలను ఎత్తిచూపుతూ.. "నాలుగేళ్ల నరకం" అనే కార్య్రాన్ని నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైసీపీ నాలుగేళ్ల పాలనలో ప్రజలు పడ్డ కష్టాలను తెలియజేడమే అని చెప్పారు. నెల రోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుంది.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడతారని ఈ సందర్భంగా తెలిపారు చంద్రబాబు.

Next Story