Vijayawada: సిట్ ఆఫీసుకు చంద్రబాబు.. విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర ఉద్రిక్తత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలు శనివారం తీవ్రంగా ఖండించాయి.
By అంజి Published on 9 Sep 2023 12:12 PM GMTVijayawada: సిట్ ఆఫీసుకు చంద్రబాబు.. విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర ఉద్రిక్తత
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలు శనివారం తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరించడం లేదని ఆరోపించారు. తమ నేత అరెస్టును ఖండిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టి అధికార వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై టైర్లు తగలబెట్టడంతో చంద్రబాబును తీసుకెళ్తున్న కాన్వాయ్ కాసేపు ఆగింది. ఆయన అరెస్టుకు నిరసనగా క్యాడర్ పెద్ద ఎత్తున వచ్చి రోడ్డు దిగ్బంధించడంతో నాయుడు కాన్వాయ్ చిలకలూరిపేట నియోజకవర్గం వద్ద నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అభిమానులు, కార్యకర్తల నినాదాల, ఎక్కడికక్కడ పోలీసుల లాఠీ చార్జ్‌తో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలింది. చివరకు చంద్రబాబును పోలీసులు తాడేపల్లిలోని కుంచనపల్లిలో ఉన్న సిట్ కార్యాలయానికి తరలించారు. ఇవాళ ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు సిట్ ఆఫీస్‌కు తీసుకొచ్చారు. సిట్ కార్యాలయంలో చంద్రబాబును కాసేపు ప్రశ్నించిన తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. చంద్రబాబును సిట్ కార్యాలయానికి తేవడంతో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం చంద్రబాబు ప్రస్తుతం పోరాడుతున్నారని, ఆయనకు అందరూ చేయూత అందించాలని ఆయన భార్య నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడును కాపాడాలని, ఆయనకు మనో ధైర్యం ఇవ్వాలని విజయవాడ కనకదుర్గమ్మను వేడుకున్నానని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న ఈ పోరాటం ప్రజలందరీ కోసమని, ప్రజలంతా చేయిచేయి కలిపి ఈ పోరాటం దిగ్విజయం చేయాలన్నారు. చివర్లో జైహింద్, జై అమరావతి అని కూడా ఆమె నినాదాలు చేశారు.