వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు.
By Srikanth Gundamalla Published on 12 July 2023 8:59 AM GMTవాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
వాలంటీర్ వ్యవస్థపై ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వుమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని ఆరోపణలు చేశారు. అంతేకాదు.. వాలంటీర్ల దగ్గర ప్రతి వ్యక్తి సమాచారం ఉందని.. అది ఎవరికి అందిస్తున్నారంటూ ప్రశ్నించారు. దాంతో.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పటికే పవన్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో పవన్ పై వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై స్పందన ఏంటని ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కావాలని.. రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కుదరదని చెప్పారు. అంతేకాదు వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సేవ వరకే వాలంటీర్ల సేవలు ఉండేలా పరిశీలన చేస్తామని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత సమాచారాని సేకరించడం ద్వారా చాలా ప్రమాదం పొంచి ఉంటుందని అన్నారు చంద్రబాబు.
ఆ తర్వా ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్దఎత్తున అవినీతి చేయాలని జగన్‌కు ఏసుక్రీస్తు చెప్పారా అని ప్రశ్నించారు. లక్షల కోట్ల ప్రజా సంపదను జగన్ నాశనం చేశారని.. లక్షల కోట్ల అప్పు చేసి ఆ భారం ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఈ నాలుగేళ్ల జగన్ పాలనలో పరిస్థితులను ప్రజలు ఇప్పటికే బేరీజు వేసుకున్నారని చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో భవిష్యత్‌కు గ్యారెంటీ కింద పల్లె నిద్ర కార్యక్రమాలు చేపడతానని చంద్రబాబు తెలిపారు.
మరోవైపు బీజేపీతో పొత్తు ఉంటుందని కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు చంద్రబాబు నిరాకరించారు. ఎవరో ఏదో మాట్లాడితే వాటిపై స్పందించి తాను చులకన కాదలుచుకోలేదని చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. విద్యుత్ సంస్కరణలు చేపడతామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.