చిత్తూరు జిల్లా కుప్పంలోని గుడిపల్లి పర్యటనలో భాగంగా మూడో రోజు గుడిపల్లికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల ఆంక్షలను నిరసిస్తూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ అధినేత పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని, దీంతో మాజీ ముఖ్యమంత్రి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారని సమాచారం. ప్రచార రథాన్ని అప్పగించాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు.
గుడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో గుడిపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, పోలీసుల తీరును చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. తన సమావేశాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రభుత్వానికి బానిసలుగా వ్యవహరించవద్దని పోలీసులకు సూచించారు. తాను ప్రజల కోసం పోరాడుతున్నానని చెప్పారు. ఇతర ప్రాంతాల వాళ్లు గుడిపల్లికి రాకుండా మూడు మార్గాల్లో అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.
పోలీసులు చట్టం ప్రకారం విధులు నిర్వర్తించాలన్నారు. ఇక్కడి నుంచి తనను పంపాలని చూస్తున్నారని, కానీ తాను వెళ్లనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు తావు లేదని చంద్రబాబు అన్నారు. తన గొంతు ఐదు కోట్ల ప్రజలదని, ఆ విషయాన్ని సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. సైకో సీఎం, ఆయన పార్టీని భూస్థాపితం చేసేం వరకు తెలుగు ప్రజల తరఫున పోరాడతానని చంద్రబాబు అన్నారు.