వైసీపీ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో నిర‌స‌నకు టీడీపీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. నిరసన కార్యక్రమంలో పాల్గొన‌డానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా అక్క‌డ ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఒకప్పుడు చంద్రబాబు పాలనలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సైతం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు.

గంట నుంచి ఆయన విమానాశ్రయంలోనే ఉన్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే పెద్దఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు రేణిగుంట చేరుకున్నారు. అయితే విమానాశ్రయం వద్ద ఆంక్షలు విధించిన పోలీసులు... ఎవరినీ లోపలికి వెళ్లనివ్వడం లేదు. చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు.

చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు... చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని స్పష్టంచేశారు.

కావాలంటే అరెస్టు చేసుకోండి. ఏంటీ దౌర్జన్యం..? ఎందుకు అడ్డుకుంటున్నారు..? ఫండమెంటల్ రైట్ లేదా నాకు కలెక్టర్ ను కలవడానికి? ఇక్కడ ఏం జరుగుతోంది? నేను ఏమైనా హత్య చేయడానికి వెళ్తున్నానా..? మీరు అనుమతి ఇవ్వకుంటే ఎస్పీ దగ్గరకు వెళ్తా.. లేదంటే ఇక్కడే బైఠాయిస్తా.. అని చంద్ర బాబు నాయుడు అన్నారు.


సామ్రాట్

Next Story