అమరావతి: అర్చకుల వేతనంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.10 వేల వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ.15 వేల వేతనం లభించనుంది. ఈ నిర్ణయం ద్వారా 1683 మంది లబ్ధి పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 10 కోట్ల భారం పడుతుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా దూపదీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఏడాదికి రూ. 32 కోట్ల అదనపు భారం పడుతుంది. వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ. 3 వేలు భృతి ఇవ్వాలని సిఎం సూచించారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలని, అపచారాలకు చోటు ఉండకూడదని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బలవంతపు మత మార్పిడులు జరగకుండా చూడాలని ఆదేశించారు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టెంపుల్ టూరిజం ప్రమోషన్ కోసం మూడు శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సీఎం.. దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఆలయ ఆదాయం రూ. 20 కోట్లు కంటే ఎక్కువ ఉంటే 15 మంది బోర్డు సభ్యులుగా ఉంటారు. దీన్ని 17కు పెంచనున్నారు.