భయపడేదే లేదు.. వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తాం: చంద్రబాబు

పక్కా ప్లాన్‌ ప్రకారమే గన్నవరంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై సైకోలు దాడికి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు అన్నారు.

By అంజి  Published on  24 Feb 2023 7:00 AM GMT
Chandra babu ,gannavaram, TDP, Andhrapradesh

భయపడేదే లేదు.. వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తాం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌: పక్కా ప్లాన్‌ ప్రకారమే గన్నవరంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై సైకోలు దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ధ్వంసమైన గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కొంతమంది బుద్ధిలేని పోలీసుల వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. ఫిర్యాదులు చేసిన వారిపైనే కేసులు పెడతారా? అంటూ ప్రశ్నించారు. పోలీసుల వింత చేష్టలు ఏ మాత్రం అర్థం కావట్లేదన్నారు. పిచ్చి రౌడీ చేష్టలకు భయపడేదే లేదని, వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తామని అన్నారు.

ఎన్ని వేల మంది వస్తారో రండి, దొంగాటలు వద్దు అని అన్నారు. పోలీసులు లేకుండా రండి చూసుకుందాం అంటూ సవాల్‌ విసిరారు. ధైర్యం ఉంటే సైకోను కూడా రమ్మనండి, లగ్నం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందామన్నారు. గన్నవరంలో పోలీసులు దొంగల్లా వ్యవహరిస్తున్నారని, అడ్వకేట్‌ ఆన్‌ డ్యూటీలో వస్తే కేసులు పెట్టడానికి వీల్లేదని గుజరాత్‌ కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. లాయర్ల మీద కేసులు పెట్టారని, గన్నవరంలో ఎయిర్‌పోర్ట్ పక్కన, నేషనల్‌ హైవేపై రౌడీలు స్వైర విహారం చేస్తుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. బాధ, ఆవేదనతో ప్రశ్నిస్తున్నానని, ఇకనైనా మారండి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రిమాండ్ లో ఉన్న టీడీపీ లీడర్‌ దొంతు చిన్నా కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శించారు. చిన్నా కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వెనుబడిన వర్గానికి చెందిన దొంతు చిన్నా ఇంటిపై రౌడీలు దాడి చేయడానికి గన్నవరం పాకిస్తాన్‌లో ఉందా అని ప్రశ్నించారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే అసలు దాడులే జరిగేవి కాదన్నారు. తమది బెదిరిస్తే పారిపోయే పార్టీ కాదని, కార్యకర్తల కోసం చివరి వరకు పోరాడతామని చెప్పారు. అధికారంలోకి రాగానే తప్పు చేసిన అధికారులు, పోలీసుల మక్కెలిరగ్గొడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Next Story