తమ్ముడి కుమారులను అక్కున జేర్చుకుని ఓదార్చిన చంద్రబాబు

తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు.

By Medi Samrat  Published on  16 Nov 2024 8:15 PM IST
తమ్ముడి కుమారులను అక్కున జేర్చుకుని ఓదార్చిన చంద్రబాబు

తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు. మహారాష్ట్రలో ఎన్డీయే తరఫున నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు హైదరాబాదు చేరుకుని ఏఐజీ ఆసుపత్రిలో తమ్ముడి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడి కుమారులు నారా రోహిత్, గిరీశ్ లను అక్కున జేర్చుకుని ఓదార్చారు.

సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తినాయుడు తనను విడిచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని, ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రామ్మూర్తినాయుడు భౌతికకాయాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నారావారిపల్లెలో రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Next Story