టీడీపీ, జనసేన కలిసినప్పటి నుంచి జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాల్లో వేడి పెరిగింది.
By Srikanth Gundamalla Published on 12 April 2024 5:27 AM GMTటీడీపీ, జనసేన కలిసినప్పటి నుంచి జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాల్లో వేడి పెరిగింది. తమ అభ్యర్థులను గెలిపించేందుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలను రచించి అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కల్యాణ్ హెలికాప్టర్‌ను అడ్డుకుంటారా అంటూ వైసీపీని నిలదీశారు చంద్రబాబు.
టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్తుంటే సీఎం జగన్ గుండెల్లో రైళ్లు పరుగుడెతున్నాయని.. అందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆఖరికి ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న పవన్‌ను పిరికితనంతో హెలిక్టాప్టర్‌ను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని ఫైర్ అయ్యారు. గురువారం అంబాజీపేట, అమలాపురంలో సభలకు రాజమహేంద్రవరం నుంచి పవన్ కల్యాణ్ హెలికాప్టర్‌లో రాకుండా సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకునేందుకు కుట్ర చేశారని అన్నారు. చివరకు చంద్రబాబు తన హెలికాప్టర్‌ను పవన్ కల్యాణ్ కోసం పంపినట్లు వెల్లడించారు. అధికారులు కూడా ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలనీ.. అధికార పార్టీకి ఏకపక్షంగా పనిచేయడం మానుకోవాలంటూ చంద్రబాబు సూచించారు.
పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. అక్కడి నుంచి అంబాజీపేట సభకు వెళ్లాలని ప్రయత్నించారని చంద్రబాబు అన్నారు. హెలికాప్టర్‌తో వచ్చిన కో పైలట్‌కు ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదనే కారణంతో ఆపేశారని అన్నారు. దాంతో.. పవన్ కల్యాణ్ దాదాపు గంట సమయం అక్కడే ఉండాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఈ సమాచారం తనకు తెలియడంతో రాజమహేంద్రవరంలో ఉన్న తన హెలికాప్టర్‌కు చెందిన కోపైలట్ సాయంతో పవన్ కోనసీమ వెళ్లారని చెప్పారు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే చేశారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై వివరణ కోరగా.. కోపైలట్‌కు ఎయిర్‌పోర్టు ఎంట్రీ పర్మిట్ లేదనీ.. సెక్యూరిటీ కారణాలతోనే అభ్యంతరం చెప్పినట్లు చంద్రబాబు చెప్పారు.