తొలి సంతకం మెగా డీఎస్సీపై.. రెండో సంతకం..: చంద్రబాబు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 11 May 2024 10:54 AM GMTతొలి సంతకం మెగా డీఎస్సీపై.. రెండో సంతకం..: చంద్రబాబు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. కొద్ది గంటల్లోనే ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీల నాయకులు ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే తాము అధికారంలోకి వస్తే ఏ పనులు చేస్తామనే దానిపైనా మాట్లాడారు చంద్రబాబు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఉన్న వర్గ ప్రజలు సంతోషంగా లేరని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలకు వైసీపీ గవర్నమెంట్ చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయని చెప్పారు. తద్వారా చాలా మంది యువత కూడా నిరుద్యోగులు అవుతున్నారన్నారు. యువత ఉద్యోగాలను కావాలనుకుంటే ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఇక తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని చెప్పారు చంద్రబాబు. తన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైనే చేస్తానని చెప్పారు. ఈ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల ఆస్తులను కాజేయాలని ప్లాన్ చేశారంటూ చంద్రాబాబు ఆరోపించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.200 పెన్షన్‌ను తామే రూ.2వేలకు పెంచామని గుర్తు చేశారు. అయితే... ఇదే పెన్షన్‌ను ఇక నుంచి రూ.4వేలకు పెంచుతామని.. పెంచిన పెన్షన్‌ను కూడా ఏప్రిల్ నుంచే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్‌ను అందిస్తామన్నారు. మన భూమి పాసుపుస్తకంపై జగన్ తన ఫోటోను వేసుకున్నారనీ.. మన ఆస్తులపై జగన్ ఫొటో ఎందుకు ఉండాలని చంద్రబాబు ప్రశ్నించారు. మీ భూములను అమ్ముకోనివ్వకుండా చేయాలనే జగన్ ఈ కుట్ర చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ఆగడాలకు చెక్ పెట్టాలంటే ఎన్నికలే ప్రధానమనీ.. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకుని వైసీపీ విముక్త రాష్ట్రాన్ని ఏర్పరచుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.