పోలవరం పూర్తి చేయడమే నా చిరకాల కోరిక: చంద్రబాబు
సీఎం జగన్ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు చంద్రబాబు.
By Srikanth Gundamalla Published on 7 April 2024 7:37 PM IST
పోలవరం పూర్తి చేయడమే నా చిరకాల కోరిక: చంద్రబాబు
ఏపీలో ఎన్నికల వేళ ప్రచారంలో మునిగిపోయాయి రాజకీయ పార్టీలు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను గురించి వివరిస్తూనే.. తాము చేయబోయే పనుల గురించి చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పామర్రులో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
పామర్రు ఎన్టీఆర్ కూడలి జన సంద్రం అయ్యిందని చంద్రబాబు అన్నారు. మచిలీపట్నం-విజయవాడ రహదారి కూడలి కిక్కిరిసిపోయిందని అన్నారు. అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం ఉండేదన్నారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేని జగన్.. మూడు రాజధానులు కడతారని ఏవోవో చెప్పి ఏం చేయలేదని అన్నారు. వైసీపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. దాంతో.. ఉద్యోగాలు లేక యువత ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన పరిస్థితులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని అన్నారు. అధికరంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చంద్రబాబు చేశారు.
సీఎం జగన్ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు చంద్రబాబు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారా? డీఎస్సీ వేశారా? అని నిలదీశారు. ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనది అన్నారు. వర్క్ ఫ్రమ్ హోం కూడా తీసుకొస్తామని అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని.. బాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన చిరకాల కోరిక అన్నారు. సీఎం జగన్ తన కేబినెట్‌లోకి బూతులు మాట్లాడే వారినే తీసుకున్నారనీ చంద్రబాబు అన్నారు.