అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరుగుతుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ మంత్రి నారాయణ స్వామి నిలదీశారు. పేదవారికి సూపర్ సిక్స్ పథకాల ఆశ చూపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడేమో భయమేస్తోందని చంద్రబాబు అంటున్నారని మండిపడ్డారు. పేదల కోసం విద్య, వైద్య రంగాల్లో జగన్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని అన్నారు.
లోకేష్, చంద్రబాబు వాటి జోలికి వెళ్లొద్దని నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు. మద్యం పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని.. గెలిచినప్పుడు ఓడిపోయిన వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు. 40 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, ఈరోజు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందంటూ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఎప్పుడూ కులాల గురించి ప్రస్తావించలేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏదో తప్పు చేశామని ప్రజల్లో తప్పుడు అభిప్రాయం వెళ్ళిందన్నారు. వైసీపీ ఓటమికి కారణం జగన్ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టడమేనన్నారు. కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వారి కులాన్ని ఓన్ చేసుకున్నారని.. ఇది ఈసారి వారి విజయానికి దోహద పడిందన్నారు.