ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ది: చంద్రబాబు
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో 'జయహో బీసీ' సదస్సు నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 3:18 PM ISTప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ది: చంద్రబాబు
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో 'జయహో బీసీ' సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీలకు తమ ప్రభుత్వం హయాంలో ఏం చేశారో చెప్పుకొచ్చారు. వెనుకబడ్డ వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానని అన్నారు. ఆదాయం పెంచే మార్గాలను సూచించానని చెప్పారు. అయితే.. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి.. అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ధి జరిగినట్లు అని పేర్కొన్నారు. టీడీపీ హయంలో బీసీలకు ఎంతో మంచి పనులను అమలు చేశామని చెప్పారు చంద్రబాబు. వైసీపీ పాలనలో మాత్రం బీసీలు చాలా కోల్పోయారని చెప్పారు. అయితే.. ఇవే విషాలను టీడీపీ సదస్సు ద్వారా తెలియజేస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ 20 శాతం రిజర్వేషన్లు తెచ్చారని చంద్రబాబు అన్నారు. ఇక తాను వచ్చాక వాటిని 30 శాతానికి పెంచామని చెప్పారు. లక్షమంది బీసీ నేతలను తీర్చిదిద్దామని చంద్రబాబు తెలిపారు. మూడు రాజధానుల ముచ్చట తీరిపోయిందనీ.. ఇక అమరావతే ఏకైక రాజధాని అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఏపీలో సీఎం జగన్ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చెత్తపై కూడా పన్ను విధిస్తున్న ఏకైక సీఎం జగన్ అని మండిపడ్డారు. కరెంటు చార్జీలను విచ్చలవిడిగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. జయహో బీసీ కోసం 40 రోజుల ప్రణాళిక రూపొందించామనీ.. పేదలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. జయహో బీసీ లక్ష్యాలను లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్రస్థాయి తీసుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు సూచించారు.