చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

By Srikanth Gundamalla  Published on  12 Oct 2023 11:25 AM IST
chandrababu, bail petition, adjourned,  high court,

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి నెలరోజులు గడిచిపోతున్నాయి. చంద్రబాబుని బయటకు తీసుకొచ్చేందుకు ఆయన తరఫు లాయర్లు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత బెయిల్‌ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 17వ తేదీ వరకు వాయిదా వేసింది.

కాగా.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందని చంద్రబాబుని సీఐడీ అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో బెయిల్‌ ఇచ్చేందుకు అంతకుముందు ఏసీబీ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో.. చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో తనని అక్రమంగా అరెస్ట్‌ చేశారని చెప్పుకొచ్చారు చంద్రబాబు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత ఆకస్మాత్తుగా లిస్ట్‌లో తన పేరు చేర్చారని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే తనని పోలీసు కస్టడీలోకి తీసుకుని సీఐడీ రెండ్రోజుల పాటు విచారించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు చంద్రబాబు.

అయితే.. ఇదే కేసలో మరో ఐదు రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ వేసి పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసిందని హైకోర్టుకు తెలిపారు చంద్రబాబు. తన వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిందని చెప్పారు. సగం జీవితం ప్రజా జీవితంలోనే ఉన్నానని.. చట్టాలను గౌరవించే వ్యక్తినని అన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ అంశాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టును చంద్రబాబు కోరారు.

Next Story