చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యి ఇవాళ్టితో 30 ఏళ్లు
నారా చంద్రబాబు నాయుడికి సెప్టెంబర్ ఒకటో తేదీ ఎంతో స్పెషల్.
By Srikanth Gundamalla Published on 1 Sep 2024 2:04 AM GMTతెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నాయకుడు.. సుదీర్ఘకాలం పాటు సీఎంగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడికి సెప్టెంబర్ ఒకటో తేదీ ఎంతో స్పెషల్. ఎందుకంటే సెప్టెంబర్ ఒకటో తేదీనే ఆయన తొలిసారిగా సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో..ఇవాళ్టితో ఆయన సీఎం అయ్యి 30 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం అయ్యారు. ఆయా చోట్లలో కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు సహా పలువురు నాయకులు వెల్లడించారు. సమాజానికి సీఎం చంద్రబాబు చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సమాజం పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి, ఆయన ఆలోచనా విధానం, నేటి తరానికి ఆదర్శమని ఈ సందర్భంగా టీడీపీ నేతలు పేర్కొన్నారు. అలాంటి నాయకుడు సీఎంగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించి 30 ఏళ్లు అవుతున్న సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు చేసుకోవడం సముచితమని అన్నారు. చంద్రబాబు వంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం.. రాష్ట్రానికి సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని టీడీపీ నేతలు అన్నారు. ఆయన దూరదృష్టికి ఎవరూ సాటిలేరన్నారు. నేటి తరాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదర్శప్రాయుడని చెప్పారు.