AP: గణేష్ మండపాలకు చలాన్లు.. హోంమంత్రి మళ్లీ ఏమన్నారంటే?

గణేష్‌ మండపాల్లో మైక్‌సెట్‌కు రూ.100, విగ్రహం హైట్‌ను బట్టి రూ.350 - 700 చలానా చెల్లించాలని ఇటీవల చెప్పిన హోంమంత్రి అనిత ఇవాళ మరోరకంగా స్పందించారు.

By అంజి  Published on  8 Sep 2024 10:25 AM GMT
Challans, Ganesh mandapam, Home Minister Anitha, APnews

AP: గణేష్ మండపాలకు చలాన్లు.. హోంమంత్రి మళ్లీ ఏమన్నారంటే?

అమరావతి: గణేష్‌ మండపాల్లో మైక్‌సెట్‌కు రూ.100, విగ్రహం హైట్‌ను బట్టి రూ.350 - 700 చలానా చెల్లించాలని ఇటీవల చెప్పిన హోంమంత్రి అనిత ఇవాళ మరోరకంగా స్పందించారు. వినాయక మండపాలకు ప్రభుత్వం ఎలాంటి చలాన్లు విధించడం లేదని హోంమంత్రి అనిత్ అన్నారు. మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవోను జగన్‌ ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్పారు.

సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం రాగానే రూపాయి కూడా వసూలు చేయొద్దని చెప్పారని వెల్లడించారు. తాము రూపాయి కూడా వసూలు చేయట్లేదని చెప్పారు. మరోవైపు పేటీఎం బ్యాచ్‌ను దింపి వైసీపీ జగన్‌ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే పలువురు భక్తులు తాము మండపాలకు కట్టిన చలాన్ల రసీదు ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

అంతకుముందు గణేష్‌ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం సింగిల్‌ విండో విధానాన్ని తీసుకొచ్చిందని హోంమంత్రి అనిత తెలిపారు. అయితే మైక్‌ పర్మిషన్‌కు, విగ్రహం హైట్‌ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి చెప్పడం వివాదాస్పదమైంది. మైక్‌ పర్మిషన్‌కు రోజుకు రూ.100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3 నుంచి 6 అడుగులుంటే రూ.350, ఆరు అడుగులపైన ఉంటే రోజుకు రూ.700 చలానా కట్టాలని ఆమె చెప్పారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గణేష్‌ మండపాల్లో మైక్ పర్మిషన్‌కు, విగ్రహం ఎత్తును బట్టి చలాన్లు కట్టాలని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు మాధవీలత మండిపడ్డారు. 'అనితక్కా.. ఏంది నీ తిక్క.. ఈ కూటమిలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తా. ప్రతి వాళ్లకూ హిందూ పండగలపై పడి ఏడవడం తప్ప పనిలేదా? మైక్‌ పర్మిషన్‌కు రూ.100, విగ్రహాలకు రూ.350 ఇవ్వాలా?. ఇదే రూల్‌ క్రిస్టియన్లు, ముస్లింలకు పెట్టండి' అని ఫైర్‌ అయ్యారు.

Next Story