ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఎన్ని వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్‌మీనా తెలిపారు.
By అంజి Published on 2 May 2024 4:53 PM ISTఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఎన్ని వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్‌మీనా తెలిపారు. విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తాం. ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. సీ విజిల్ యాప్ ద్వారా 16,345 ఫిర్యాదులు అందాయన్న ముకేశ్ కుమార్ మీనా.. డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
10,403 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు సంబంధించి 864 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, 156 మందికి గాయాలయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.203 కోట్ల సొత్తు సీజ్ చేశామని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ముకేష్ కుమార్ తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, వెట్ టవర్స్ సిద్ధం చేసినట్లు వివరించారు. 25 వేల మంది ఇంటి నుంచే ఓటు వేయనున్నట్టు పేర్కొన్నారు.