ఎంపీలాడ్స్ నిధులు.. నివేదిక ఇవ్వాల‌ని ఏపీకి కేంద్రం లేఖ‌

Centre Serious on AP MPLads funds misuse.ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల వినియోగం పై వివ‌రణ‌ ఇవ్వాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Oct 2021 7:50 AM GMT
ఎంపీలాడ్స్ నిధులు.. నివేదిక ఇవ్వాల‌ని ఏపీకి కేంద్రం లేఖ‌

ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల వినియోగం పై వివ‌రణ‌ ఇవ్వాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేంద్రం లేఖ రాసింది. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నిధులు ఖ‌ర్చుచేయ‌లేద‌ని ఫిర్యాదులు అంద‌డంతో కేంద్రం ఈ చ‌ర్య తీసుకుంది. మత పరమైన భవనాల నిర్మాణానికి, మరమ్మత్తుల కోసం ఎంపీలాడ్స్ నిధులు కేటాయించారన్న ఫిర్యాదు మేరకు వివరణ కోరింది కేంద్రం. ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి, వాస్త‌వాలేమిటో వివ‌రిస్తూ స‌మ‌గ్ర నివేదిక‌ను పంపించాల‌ని రాష్ట్ర ప్ర‌ణాళికా శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శికి కేంద్ర గ‌ణాంక‌శాఖ అండ‌ర్ సెక్ర‌ట‌రీ లేఖ రాశారు. దాని ప్ర‌తిని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి పంపించారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై చేసిన ఫిర్యాదు మేరకు ప్రధాని కార్యాలయం స్పందించిందని.. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ లేఖ రాస్తున్నట్లు కేంద్ర గణాంకశాఖ పేర్కొంది. గుంటూరు జిల్లా బాపట్లలోని ఓ చర్చి నిర్మాణం, మరమ్మతుల కోసం రూ. 86 లక్షలు ఖర్చు చేయడం సహా చాలా చోట్ల ఇదే తరహాలో వ్యయం చేశారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరణ కోరాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకు పీఎంవో ఆదేశాలు ఇచ్చింది.

ఇక ఎంపీలాడ్స్ నిధుల వ్యయాన్ని పర్యవేక్షించాల్సిన రాష్ట్రస్థాయి నోడల్ విభాగం, జిల్లా అధికారులు కూడా నిబంధనలు పాటించడం లేదని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన అన్ని నోడల్ విభాగాలతోనూ ఆడిట్ నిర్వహించి అవి దుర్వినియోగం కాకుండా చూడాలని కేంద్రం సూచించింది. ఎంపీ లాడ్స్ కింద ప్రతి ఎంపీకి కేంద్రం ఏటా 5 కోట్ల నిధులు ఇస్తుంది.

Next Story