ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర హైకోర్టు అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారని వస్తున్న వార్తలపై ఈరోజు రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేశారు. హైకోర్టు తరలింపు అంశంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
గతేడాది పిబ్రవరిలో హైకోర్టు తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రతిపాదనలు పంపారని తెలిపారు. ఉన్నత న్యాయస్థానం తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని చెప్పారు. హైకోర్టు నిర్వహణ బాధ్యతంతా రాష్ట్రప్రభుత్వానిదే అని, పరిపాలన మాత్రం ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటుందని అన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు. న్యాయస్థానం తరలింపు కోసం ఎలాంటి గడువూ లేదని స్పష్టం చేశారు. హైకోర్టు, ఏపీ ప్రభుత్వం సంప్రదింపుల తరువాతే 3 రాజధానులపై నిర్ణయం ఉంటుందని కేంద్రమంత్రి రవిశంకర్ సమాధానం ఇచ్చారు.