ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో చెప్పిన మాదిరే.. ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశం అనేది ముగిసిన అధ్యాయం అని మరోసారి లోక్‌సభలో స్పష్టం చేసింది. సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య ఎటువంటి తేడాను పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ చూపలేదని మరోసారి స్పష్టం చేసింది. పదిహేనో ఫైనాన్స్ కమిషన్ కూడా అదే తీరును కొనసాగిస్తోందని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
''ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యత ఇవ్వలేదు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచాం. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫార్సులను కొనసాగించింది. విభజన చట్టం హామీలను చాలా వరకు నెరవేర్చాం. కొన్ని మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్ని వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మధ్య 28 సమావేశాలు ఏర్పాటు చేశాం'' అని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ వివరించారు.