తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం పరిష్కారం కాని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఈ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. సమావేశ అజెండాలో ప్రత్యేక హోదా అంశం కూడా ఉండడం గమనార్హం.
కాగా.. విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్‌ఎస్ రావత్ లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
త్రిసభ్య కమిటి ఎజెండాలోని అంశాలు
1. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
2.ఏపీ - తెలంగాణ మధ్య వినియోగ సమస్యపై పరిష్కారం
3.పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం
4.రాష్ట్రాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు
5. APSCSCL, TSCSCL మధ్య నగదు ఖాతాల విభజన
6 ఏపీ - తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ
7.ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జిల్లాల ప్రత్యేక గ్రాంటు
8.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
9. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు