దేశంలో ఆక్సిజన్ కొరత వెంటాడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఆక్సిజన్ కొరత తీర్చడానికి ప్రభుత్వ అధికారులు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్స్‌తో వచ్చిన రైలు ఆదివారం న్యూ గుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైలులో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. వీటిలో 78 టన్నుల ఆక్సిజన్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆక్సిజన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. రాష్ట్రానికి 910 టన్నుల ఆక్సిజన్ అవసరమని సీఎం జగన్ కేంద్రానికి ఇప్పటికే లేఖ రాయడంతో.. ఈ మేరకు ఆక్సిజన్ వచ్చింది. ఐఏఎస్ అధికారి కృష్ణబాబు ట్యాంకర్ల పంపిణీని పర్యవేక్షిస్తూ ఉన్నారు.

రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లేఖ రాశారు. రాయలసీమలో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) అవసరాల దృష్ట్యా కొవిడ్‌ కేసులు అదుపులోకి వచ్చేవరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ ప్లాంట్‌ నుంచి రోజూ 80 టన్నుల ఆక్సిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేసేలా అధికారులను ఆదేశించాలని ప్రధానికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రం ఆక్సిజన్‌ కొరత నుంచి బయటపడాలంటే రోజూ 910 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమని సీఎం తన లేఖలో వివరించారు. రాయలసీమ జిల్లాలకు తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్‌ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను ప్రధానికి వివరించారు. జామ్‌నగర్‌ ప్లాంట్‌ నుంచి సరఫరా చేసిన 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాయలసీమలో కొరతను అధిగమించేందుకు ఎంతో ఉపయోగపడిందని.. రోజూ అక్కడి నుంచి 80 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు.


సామ్రాట్

Next Story