ఏలూరు: బాధితుల రక్త నమూనాల రిపోర్టులకు వారం రోజుల సమయం: సీసీఎంబీ డైరెక్టర్
CCMB Director Rakesh on Eluru incident .. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
By సుభాష్ Published on 8 Dec 2020 11:45 AM GMTపశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అస్వస్థతకు గురైన బాధితులకు సంబంధించి 15 రక్త నమూనాలు వచ్చాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. వాంతులు, వీరేచనాలకు సంబంధించి నమూనాలను సంబంధిత అధికారులను అడిగినట్లు చెప్పారు. రక్త నమూనాల ద్వారా అన్ని రకాల బ్యాక్టీరియల్, వైరస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే పరీక్షలకు సంబంధించిన నివేదిక వచ్చేందుకు వారం రోజుల సమయం పడుతుందని రాకేష్ మిశ్రా పేర్కొన్నారు.
నమూనాల్లో భారలోహాల అవశేషాలు
కాగా, అస్వస్థతకు గురైన వారి నుంచి సేకరించిన నమూనాల్లో భారలోహాల అవశేషాలను ప్రాథమికంగా గుర్తించినట్లు మంగళగిరి ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ కక్కర్ తెలిపారు. సీసం, నికెల్ లోహాల కారణంగానే స్కృహ కోల్పోవడం, మూర్ఛ లక్షణాలు వచ్చాయన్నారు. దీనంతటికి నీటి కాలుష్యమే కారణమై ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. ఎక్కడి నుంచి ఈ భారలోహాలు వచ్చాయో తెలుసుకునేందుకు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మరో బృందం ఏలూరు వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. నీరు, ఆహార నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాకేష్ కక్కర్ తెలిపారు.
కాగా, రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో సీసం, నికెల్ అనే లోహాల అవశేషాలు ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ పరీక్షల్లో తేలింది. ఈ పరీక్షల వివరాలను మంగళగిరి ఎయిమ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. సీసం కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తాయని, బ్యాటరీల్లో ఉండే ఈ లోహం తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలోకి వెళ్లి ఉండవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.