ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆయన తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలకు వెళ్లనున్నారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పును వెలువరించారు.
జగన్ సీబీఐ కోర్టులో క్విడ్ ప్రోకో పెట్టుబడుల కేసును ఎదుర్కొంటున్నారు. వైసీపీ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ''నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలను లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. ఇప్పటి వరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నా'' అంటూ సీఎం జగన్ పోస్ట్ పెట్టారు.