వివేకా హత్య కేసు.. సమాచారం చెబితే రూ.5లక్షలు రివార్డు
CBI announce reward of RS 5 Lakh for providing information on Viveka murder case.ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి
By తోట వంశీ కుమార్ Published on 21 Aug 2021 10:19 AM IST
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు అనుమానితులతో పాటూ పలువురిని ప్రశ్నించింది. తాజాగా సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం అందిస్తే రివార్డు అందిస్తామని పత్రికా ప్రకటన ఇచ్చింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది.
సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది. హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.
దాదాపు ఏడాది నుంచి ఈ కేసుపై విచారణ చేస్తున్న సీబీఐ అనేక మంది అనుమానితులను ఇప్పటికే పలు దఫాలుగా ప్రశ్నించింది. మూడు నెలల కిందట నాలుగో దఫా విచారణ చేపట్టిన సీబీఐ.. వరుసగా 75 రోజుల పాటు విచారణ చేసింది. శుక్రవారం కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్‌లో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పటికే అతడిని పలుమార్లు ప్రశ్నించారు. శనివారం మరికొందరిని కూడా విచారణకు పిలిచారు. అలాగే వైఎస్సార్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సీసీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని మొదటిసారిగా విచారణకు పిలిపించారు. మరోవైపు వైఎస్ వివేకా కుమార్తె సునీత సీబీఐ అధికారుల్ని కలిశారు. దాదాపు 4 గంటలకుపైగా వారితో భేటీ అయ్యారు.