రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు నగదు రహిత వైద్యం
రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్యం సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం-రాహత్ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అమలుకు అవసరమైన చర్యలు పూర్తి కావచ్చాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
By - Medi Samrat |
రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్యం సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం-రాహత్ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అమలుకు అవసరమైన చర్యలు పూర్తి కావచ్చాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో పథకం అమలులోనికి వస్తుoదని చెప్పారు. రోడ్డు ప్రమాద బాధితులకు 'గోల్డెన్' అవర్లో రూ.1.5 లక్షల వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఉద్దేశించిన పీఎం-రాహత్ పథకాన్ని ట్రస్టు అనుబంధ గుర్తింపు పొంది ఆర్థో, పాలీట్రామా సేవలు అందుబాటులో ఉన్న 687 ప్రైవేట్, 17 ప్రభుత్వాసుపత్రుల్లో అమలు చేస్తున్నామని ప్రకటించారు. పీఎం-రాహత్ పథకం అమలు కోసం ట్రస్టు కార్యాలయంలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితుల ఆర్థిక పరిస్థితులు, స్థానికతతో సంబంధం లేకుండా ఎవరికైనా సరే అసుపత్రుల్లో చేరినప్పుడు తక్షణ సాయం కింద ఏడు రోజులపాటు లేదా రూ.1.5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అసుపత్రులు అందించాలని మంత్రి శ్రీ సత్యకుమార్ స్పష్టంచేశారు.
ఇన్ పేషెంట్ గా ఏడు రోజులు పాటు ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఈ పథకం అమలులో ముఖ్యంగా 'గోల్డెన్ అవర్లో నగదు రహిత విధానంలో చికిత్స అందించడంవల్ల విలువైన ప్రాణాలు దక్కుతాయన్నారు. సత్వర చికిత్సతో త్వరగా క్షతగాత్రులు కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ మోటారు వెహికల్ యాక్ట్-162, 1988 అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ట్రస్టు ద్వారా ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా సమన్వయకర్తలు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు ఆదేశాలు పంపినట్లు వివరించారు. బీమా సదుపాయం కింద క్లైమ్ చేసిన వారికి మినహా మిగిలిన వారికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని పిఎఫ్ ఎంఎస్ ( పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం)ద్వారా ఆర్.బి.ఐ నిబంధనలకు అనుగుణంగా ఆసుపత్రులకు చెల్లింపులు జరుగుతాయి. వైద్య ఆరోగ్య శాఖతో పాటు పోలీసు, రోడ్డు రవాణా శాఖలు ఈ పథకం అమల్లో భాగస్వాములుగా ఉన్నాయి.
ప్రధానమంత్రికి కృతజ్ఞతలు
ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యoపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. 70 ఏళ్లు దాటిన వృద్ధులు అందరికి ఉచిత వైద్య ( పీఎం వయో వందన పథకం) సదుపాయాన్ని ప్రధానమంత్రి అమల్లోకి తెచ్చారన్నారు. పీఎం- రాహత్ పథకo అమలువల్ల విలువైన ప్రాణాలకు భరోసా లభించిందని చెప్పారు. మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
నెలకు ప్రమాదాల చికిత్స వ్యయఓ రూ.27 కోట్లు
ట్రస్టు తరపున అన్ని రకాల ప్రమాదాల కింద చికిత్స పొందే వారికి ప్రతినెలా స సగటున రూ. 27 కోట్ల వరకు వ్యయమవుతోoది. ఇందులో 70 శాతం వరకు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు ఉంటున్నాయి.
ఎక్కడైనా... ఎవరికైనా...
ఇప్పటివరకు రోడ్డు ప్రమాద క్షతగాత్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు కింద అర్హత కలిగిన వారికి అనుబంధ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుతోంది. బీమా సౌకర్యం కలిగిన వారు సదరు సంస్థల నియమ నిబంధనల అనుసరించి ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. ఈ రెండు సౌకర్యాలు లేనివారు నగదు చెల్లించి వైద్య సేవలు పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని వారు వైద్య సేవలు పొందటంలో అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్షతగాత్రుల ఆర్ధిక పరిస్థితులు, స్థానికత, ఇతర నియమ నిబంధనలతో నిమిత్తం లేకుండా పీఎం-రాహత్ (రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్) పథకo అమలుపై ప్రకటన చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.
ఎలక్ట్రానిక్ డిటైల్డ్-యాక్సిడెంట్ రిపోర్టు (ఈ-ధార్)
రోడ్డు ప్రమాద క్షతగాత్రులు ఆసుపత్రులకు వచ్చినప్పుడు జరిగిన ప్రమాద స్థలం, ఇతర వివరాలను ఆన్లైన్ (ట్రాన్సాక్షన్ మేనేజ్మెంటు సిస్టం-20 కింద) లో నమోదు చేసిన వెంటనే సమీప పోలీసు స్టేషన్ వారికి సమాచారం వెళ్తుoది. 24 గంటల్లోగా పోలీసులు యాక్సిడెంటు వివరాలపై ఆసుపత్రుల వారికి నిర్ధారణ చేస్తారు. అప్పుడు క్షతగాత్రులకు అందే చికిత్స యాక్సిడెంటు కేసుల పరిధిలోనికి వస్తుంది. ఇందుకు అనుగుణంగా చికిత్స, చెల్లింపులు, ఇతర చర్యలు ఉంటాయి. ఆన్లైన్ వేదికగానే ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
అసుపత్రులకు లాగిన్ సౌకర్యం
ఈ క్రమంలోనే తొలుత ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు వారిని ఈ పథకం అమల్లో భాగస్వాములను చేసింది. ట్రస్టు పరిధిలోని ' ట్రాన్సాక్షన్ మేనేజ్మెంటు సిస్టమ్-2.0 (టీఎంఎస్ 2.0) కింద ఆసుపత్రుల వారికి లాగిన్ సౌకర్యాన్ని కల్పించింది. దీని ప్రకారం రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు అందించే చికిత్సకు సంబంధించిన వివరాలను టీఎంఎస్- 2.0 ద్వారా పంపించాలి.
6 గంటల్లోగా అనుమతులు జారీ
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలో ఆసుపత్రుల వారు తమ వద్దకు క్షతగాత్రులు వచ్చిన వెంటనే ప్రస్తుత విధానంలో మాదిరిగానే లాగిన్ ద్వారా కేసుల వివరాలను ఫ్రీ ఆథరైజేషన్ కోసం పంపాలి. ఇది అందిన వెంటనే ఆరు గంటల్లోగా అనుమతుల జారీ జరుగుతుంది. చికిత్స పూర్తయిన అనంతరం సదరు అసుపత్రుల వారు పంపే వివరాలను ట్రస్టులోని వైద్యుల బృందం పరిశీలించి చెల్లింపులకు ఓకే చెబుతుంది. బీమా సౌకర్యం ఉంటే సదరు బీమా కౌన్సిళ్లకు సమాచారం వెళ్తుంది. ఇందుకు అనుగుణంగా ఆన్లైన్లో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు
బిల్లుల చెల్లింపు 2 రకాలు:
1. ప్రమాదానికి గురైన వాహనం లేదా ప్రమాదానికి కారణమైన వాహనం బీమా పరిధిలో ఉంటే చికిత్సకు సంబంధించిన బిల్లులు అసుపత్రుల వారు పంపిన పది రోజుల్లో సదరు బీమా కౌన్సెళ్ల ద్వారా చెల్లింపులు జరుగుతాయి. నిర్ణీత గడువు దాటినప్పటికీ చెల్లింపులు జరగకుండా ఉన్నా, స్పందించకుండా ఉంటే సదరు ఆసుపత్రులకు ఆటోమేటిగ్గా బీమా కౌన్సెళ్ల ద్వారా చెల్లింపులు జరుగుతాయి.
2. హిట్ అండ్ రన్ కేసుల్లో..
హిట్ అండ్ రన్ కేసుల్లో లేదా ప్రమాదాలకు కారణమైన వాహనాలకు బీమా సదుపాయం లేకుండా ఉంటే... ఆసుపత్రుల వారు సమర్పించిన బిల్లులకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని 'పీఎఫ్ఎంఎస్' (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు సిస్టం) ఖాతా ద్వారా నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరుగుతాయి. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో 'పీఎఫ్ఎంఎస్' ఖాతాలు ప్రారంభించారు.
వీధుల్లో జరిగే ప్రమాదాలకు సైతం...
జాతీయ, రాష్ట్ర, జిల్లా, పంచాయతీ రోడ్డు అన్న నిబంధన ఏమీలేదు. అన్ని రకాల రోడ్డు ప్రమాదాలూ దీని పరిధిలోనికి వస్తాయి. ట్రస్టు పరిధిలో లేని అసుపత్రులు సైతం పీఎం-రహత్ పథకం కింద చికిత్స అందిస్తే చెల్లింపులు జరుగుతాయి. రోడ్డు ప్రమాద బాధితులకు అసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు ఆసుపత్రుల్లో చికిత్సకు తగ్గ సౌకర్యాలు లేకుంటే అక్కడి వారు రవాణా సౌకర్యాలు కల్పించాలి. బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆసుపత్రికి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.