విషాదం.. కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి
Car plunges into canal in Mopidevi mandal.కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలోని
By తోట వంశీ కుమార్ Published on 18 Sep 2021 5:46 AM GMT
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలోని కృష్ణా కరకట్టపై ఇన్నోవా వాహనం అదుపు తప్పి కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం నుంచి నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మోపిదేవి మండలం చిరువోలు గ్రామానికి చెందిన ఆరుగురు కారులో విజయవాడ నుంచి మోపిదేవి గ్రామానికి వెలుతున్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు కొత్తపాలెం సమీపంలోకి రాగానే.. అదుపు తప్పి ఓ స్తంభాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రశాంత్(25) అనే యువకుడు అక్కడిక్కడే ప్రమాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. కాలువలోకి దిగి కారు అద్దాలు పగలకొట్టి కారులోని వారిని రక్షించారు.
సింహాద్రి శరత్ కు కాలికి గాయమైంది. దీంతో అతడికి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.