నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం నేటితో 600 రోజులకు చేరింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ముక్తకంఠంతో నినదిస్తూ సాగుతున్న ఉద్యమం ఇది. రాజధాని తరలిపోకుండా ఉండాలని రైతులు చేయని ప్రయత్నం లేదు. లాఠీలు విరిగినా, జైళ్లకు వెళ్లినా.. కరోనా భయపెడుతున్నా.. దేన్నీ లెక్కచేయకుండా వారు చేస్తున్న అమరావతి పోరాటం 600వ రోజుకు చేరింది.
ఈ సందర్భంగా రాజధాని నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకుంది. రాజధానిలో భారీగా పోలీసులను మోహరించారు. రాజధానిలోకి కొత్తవారిని అనుమతించని పోలీసులు కరకట్టపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆలయం చుట్టూ ఇనుప కంచెను ఉంచారు.
పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో మీడియాను అనుమతించడం లేదు. పెదపరిమి వద్దే మీడియా ప్రతినిధుల వాహనాలను నిలిపివేశారు. పలు చోట్ల నిరసనలను దిగిన అమరావతి ఉద్యమకారులు, టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేశాకే విడిచి పెడుతున్నారు.