అమరావతి: నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. నేరం జరిగే అవకాశం ఉందని భావిస్తే వెంటనే ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, బాధితులను రక్షిస్తామని తెలిపారు. నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారని ఆయన చెప్పారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. నేరాలకు పాల్పడిత ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు.
నేరాలను అరికట్టడంలో సమాజం బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, గస్తీ బృందాలు పెడుతున్నామని చెప్పారు. నేరాల ముప్పును ముందే గమనించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సున్నితమైన కేసుల్లో బాధితుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. న్యాయస్థానాల్లో నేర నిరూపణ చేయించి.. నేరగాళ్లకు చట్టపరంగా శిక్ష వేయించేలా ఫోరెన్సిక్ ఆధారాలు పక్కాగా సేకరించాలని ఆదేశాలు ఇచ్చామని డీజీపీ హరీశ్ గుప్తా తెలిపారు.