విద్యా సంస్థల్లో అక్రమాలుంటే 1902 కాల్ చేయండి: సీఎం జగన్
జగనన్న విద్యా దీవెన పథకం.. పిల్లల భవిష్యత్తుని మార్చే పథకమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పైచదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నట్టు తెలిపారు.
By అంజి Published on 28 Aug 2023 8:00 AM GMTవిద్యా సంస్థల్లో అక్రమాలుంటే 1902 కాల్ చేయండి: సీఎం జగన్
జగనన్న విద్యా దీవెన పథకం.. పిల్లల భవిష్యత్తుని మార్చే పథకమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పైచదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నట్టు తెలిపారు. ఇవాళ నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలవకూడదని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకు రూ.15,600 కోట్లు అందించామని తెలిపారు.
విద్యాదీవెన కింద రూ. 11, 317 కోట్లు అందించామని పేర్కొన్నారు. నేడు 8, 44,336 తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామని, అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందించామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడయం అమలు చేస్తున్నామన్నారు. పేదరికం విద్యార్థుల చదువులకు అడ్డు కావొద్దన్నారు. విద్యా సంస్థల్లో ఏమైనా అక్రమాలు జరిగితే వెంటనే 1902కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సీఎ జగన్ సూచించారు.
విద్యా సంస్థల్లో బోధన లేకపోయినా, వసతుల కొరత ఉన్నా నేరుగా జగనన్నకు చెబుదాంకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి తల్లి తమ ఖాతాకు డబ్బులు వచ్చిన వారం పదిరోజుల్లో కాలేజీలకు వెళ్లి బోధన ఎలా ఉందో, వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించాలని సూచించారు. కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కును ప్రభుత్వం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. వసతి, భోజనం, బోధన బాగోకపోయిన, ఇతర ఫీజులు వసూలు చేసినా 1902కు ఫోన్ చేయాలని, జగనన్నకు చెబుదాంకు చెబితే ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడుతుందని చెప్పారు.