తరగతి గదిలో కొందరు బీటెక్ విద్యార్థులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కాలేజీ యాజమాన్యం వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. కాకినాడ జిల్లా సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఒక పాటకు డ్యాన్స్ చేశారు. ఇష్టం వచ్చినట్టు స్టెప్పులు వేశారు. ఆ స్టెప్పులు చూసేవారికి ఇబ్బందికరంగా ఉన్నాయి. వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయిన తర్వాత వారి డ్యాన్స్ మూమెంట్‌లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కళాశాల యాజమాన్యం వారిని సస్పెండ్ చేసింది. రోజూ కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్నారని, వారు మానసిక క్షోభకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను చేసింది తప్పేనని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తరగతులకు అనుమతించాలని తల్లిదండ్రులు యాజమాన్యాన్ని అభ్యర్థిస్తున్నారు. గతంలో కాలేజీ నుంచి సస్పెండ్ కావడంతో ఓ విద్యార్థి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థులు ఏమైనా చేసుకుంటే కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.