గుంటూరులోని శ్రీసాయి ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. రోగికి సినిమా చూపిస్తూ విజయవంతంగా మెదడుకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ టైంలో స్పృహలోని ఉన్న రోగికి సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'అగ్నిపర్వతం', సీఎం వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం వీడియో చూపించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా న్యూరోసర్జన్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి ఈ ఆపరేషన్ చేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెర్వు మండలం ఇసుకత్రిపురాంతకం గ్రామానికి చెందిన గోపనబోయిన పెద ఆంజనేయులు (43) ఏడేళ్లుగా మెడిసన వాడిన ఫిట్స్ తగ్గడం లేదు.
దీంతో గుంటూరులోని శ్రీసాయి ఆస్పత్రిలో వైద్యులకు చూపించుకున్నాడు. మెదడులో కీలకమైన ఫ్రంటల్ ఫ్రీ మోటార్ ప్రాంతంలో 7.5 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాలు, చేయిని ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో కణితి ఉంది. దీంతో వైద్యులు.. రోగి స్పృహలో ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 25న ఆపరేషన్ చేసే టైంలో రోగికి 'అగ్నిపర్వతం' సినిమా చూపించారు. రోగి మాట్లాడుతుండగానే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయడానికి కంప్యూటర్ నావిగేషన్ ఉపయోగించారు.