మా లక్ష్యం అదే.. టీడీపీ కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తుంది
Botsa Satyanarayana Fires On TDP. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీపై రాష్ట్ర హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారయణ
By Medi Samrat Published on 9 Oct 2021 3:38 PM ISTరాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీపై రాష్ట్ర హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారయణ స్పందించారు. విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకే పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో 220 చదరపు అడుగుల స్థలం ఇవ్వాలని నిబంధన వుంది. కాని రాష్ట్రంలో పేదలకు 270 చదరపు అడుగుల స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం ఇస్తున్నామని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు.
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని, స్ఫూర్తిని అర్ధంచేసుకోవాలని న్యాయస్థానాలను అభ్యర్ధిస్తున్నామన్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా కాకుండా ఎవరికోసం, ఏ స్ఫూర్తితో చేస్తున్నామో చూడాలని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇళ్లు వుండాలనే లక్ష్యంతో ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ చేపట్టారని వివరించారు. ఇదే అంశంతో రాష్ట్ర హైకోర్టులో పునరాలోచించాలని కోరుతూ అప్పీల్ చేస్తున్నామని.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి వాగ్దానాన్ని, ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు.
అధికారం కోల్పోయిన టీడీపీ నాయకులు చిన్న చిన్న సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకొని పేదలకు మేలు చేకూర్చే పథకాలు, కార్యక్రమాలపై కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అస్థవ్యస్థం చేసింది చంద్రబాబు నాయుడేనని బొత్స విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో బకాయిలన్నీ పెండింగ్ పెట్టి వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేయకుండా వదిలేశారని.. వాటన్నింటినీ ఈ ప్రభుత్వ హయాంలో చెల్లిస్తున్నామని తెలిపారు. గతంలో అధిక టారిఫ్‌లకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే నేడు విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకున్నాయని.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఫైర్ అయ్యారు.