జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి లొంగిపోయారు.
By అంజి
జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
అమరావతి: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి లొంగిపోయారు. నిన్నటితోనే ఆయన మధ్యంతర బెయిల్ ముగిసినా జైలుకు వెళ్లలేదు. మరోసారి బెయిల్ పొడిగించాలని ఆయన న్యాయవాది కోరగా హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇవాళ జైలుకు వెళ్లి లొంగిపోయారు. మీడియా కంటపడకుండా ఈరోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకొని జైలు సూపరింటెండెంట్‌కు బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. తల్లి ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో బోరుగడ్డ అనిల్ బెయిల్ పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.
గత హయాంలో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని మధ్యంతర బెయిలు పొడిగించుకున్న సంగతి తెలిసిందే. అయితే బెయిలు గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిపోయింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. అతడు ఆ సమయంలోపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. అయితే మళ్లీ బెయిలు పొడిగించాలంటూ మంగళవారం తన న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు బెయిల్ పొడిగింపుకు అంగీకరించలేదు.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్ గడువు ముగిసేలోపు బోరుగడ్డ అనిల్ జైలుకు వచ్చి లొంగిపోలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు, పై అధికారులకు తెలియచేశామని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.